విద్యార్థుల అభ్యసనంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

విద్యార్థుల అభ్యసనంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
  • – నవాబుపేట పాఠశాలలో సందీప్ కుమార్ ఝా
  • – ఆకస్మిక తనిఖీ ఏడో తరగతిలో గాలి పీడనంపై ఆసక్తికర బోధన
  • – పదో తరగతి విద్యార్థులకు గణిత సమస్యల వివరణ
  • – పరిశుభ్రత, మౌలిక సదుపాయాల నిర్వహణపై ఆదేశాలు

జనగామ, నవంబర్ 3 (సేనాని ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. పాఠ్యాంశాలను విద్యార్థులకు పూర్తిస్థాయిలో అర్థమయ్యేలా ఆసక్తికరమైన బోధనా పద్ధతులను అనుసరించాలని, రోజువారీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, ఉదాహరణలతో విషయాలను వివరించాలని తెలిపారు. మంగళవారం లింగాల ఘనపురం మండలం నవాబుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, తాగునీటి సదుపాయం, గ్రంథాలయం, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని స్వయంగా తెలుసుకుంటూ ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించారు.
తొలుత పాఠశాలలోని తాగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించి, దాని నిర్వహణ, నీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న ఆహారం గురించి వంట సిబ్బందిని ప్రశ్నించారు. ఆ రోజు అన్నం, సొరకాయ పప్పు తయారు చేస్తున్నట్లు వారు వివరించగా, ప్రభుత్వం నిర్దేశించిన ఆహార పట్టిక ప్రకారం భోజనం అందించాలని, వంటకు అవసరమైన వంటగ్యాస్‌ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులకు శుభ్రమైన, రుచికరమైన ఆహారం అందించాలన్నారు. పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని చదువుకునేందుకు బల్లలు, కుర్చీలు, వివిధ రకాల పుస్తకాలు సమకూర్చాలని సూచించారు.
ఏడో తరగతి గదిని సందర్శించిన కలెక్టర్‌ సైన్స్‌ పాఠ్యాంశాల బోధనను పరిశీలించారు. విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. గాలిలో ఉండే వాయువుల మిశ్రమం, అందులో నత్రజని శాతం, గదిలో గాలి పీడనం వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారు. సాధారణ వాతావరణ పీడనం సుమారు ఒక బార్‌ ఉంటుందని వివరిస్తూ, గాలి పీడనం, గాలి వేగం మధ్య సంబంధాన్ని వివరించారు. మోటారు సైకిల్‌ టైరు ఉదాహరణగా తీసుకొని, టైర్‌లోని గాలి పీడనం బయట వాతావరణ పీడనం కంటే భిన్నంగా ఉంటుందని, టైరు పంక్చర్‌ అయినప్పుడు గాలి బయటకు ఎలా వస్తుందో విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పారు. తుఫానుల ఏర్పాటులో వాతావరణ పీడనానికి ఉన్న ప్రాధాన్యతను కూడా వివరించారు. ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి సెల్‌ఫోన్లు తీసుకురాకుండా, బోధనా సమయంలో పూర్తిగా విద్యార్థుల అభ్యసనంపైనే దృష్టి పెట్టాలని సూచించారు.
పదో తరగతిలో గణిత బోధనను పరిశీలించిన కలెక్టర్‌ విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాలను పరీక్షించారు. ముఖ్యంగా గ్రాఫ్‌లకు సంబంధించిన అంశాల్లో మరింత సాధన చేయాలని సూచించారు. అనంతరం ఏ, బి, సి, డి బిందువులను ఆధారంగా తీసుకొని ఒక గణిత సమస్యను స్వయంగా వివరించారు. సి బిందువు వద్ద ఉన్న నీటి తొట్టె, డి బిందువు వద్ద ఉన్న ఇంటి మధ్య దూరం 50 మీటర్లుగా తీసుకొని, ఏ బిందువు వద్ద 30 డిగ్రీలు, మరోవైపు 45 డిగ్రీల కోణం ఉన్నప్పుడు బి నుంచి డి వరకు దూరం ఎంత, ఏబీ ఎత్తు ఎంత అనే ప్రశ్నలను విద్యార్థుల ముందుంచారు. సమస్యను దశలవారీగా విశ్లేషిస్తూ గణిత సూత్రాలను ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలో వివరించారు. విద్యార్థులు స్వయంగా సమస్యలను పరిష్కరించేలా ప్రోత్సహించారు. ఎనిమిదో తరగతిలో గణితం, తొమ్మిదో తరగతిలో తెలుగు బోధనను కూడా పరిశీలించి, విద్యార్థుల పఠన సామర్థ్యం, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు.
పాఠశాలలోని ప్రయోగశాలలు, గణిత ప్రయోగశాల, వ్యాయామ విద్య గదిని పరిశీలించిన కలెక్టర్‌ వాటిని విద్యార్థుల అభ్యసనానికి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ప్రయోగశాల గదికి రంగులు వేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించడం, బోధనలో నూతన పద్ధతులు అనుసరించడం ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.