వ్యవసాయంలో డిజిటల్ సేవల విస్తరణకు చర్యలు

- – అగ్రిస్టాక్ నమోదులో తప్పులకు తావివ్వొద్దు
- – రైతులకు ప్రభుత్వ పథకాలు సులభంగా అందాలి
- – జనగామలో 94 శాతం పంటల నమోదు పూర్తి
- – రైతు గుర్తింపు కార్డుల నమోదుపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సమీక్ష
జనగామ, అక్టోబర్ 31 (సేనాని ప్రతినిధి): వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు రైతులకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రిస్టాక్ వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అగ్రిస్టాక్ అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి పురోగతిని సమీక్షించారు. రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే వ్యవస్థలో నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అగ్రిస్టాక్‌లో డిజిటల్ పంటల సర్వే, రైతుల వివరాల నమోదు అత్యంత కీలకమైన అంశాలని కలెక్టర్ పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ డిజిటల్ వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు. ఇందులో రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించడం, భౌగోళిక సమాచారంతో కూడిన గ్రామ పటాలను నమోదు చేయడం, సాగు భూములు, పంటల వివరాలను నమోదు చేయడం వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. రైతుల పేర్లు, భూముల వివరాలు, సర్వే సంఖ్యలు, సాగు సమాచారాన్ని నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం నమోదైతే భవిష్యత్తులో రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు.
జిల్లాలో ఇప్పటివరకు పంటల నమోదు ప్రక్రియ 94 శాతం పూర్తికాగా, రైతు గుర్తింపు సంఖ్యల నమోదులో 78 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని గ్రామాల పటాలను భౌగోళిక సమాచారంతో అనుసంధానించే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వ్యవసాయ భూములకు సంబంధించిన డిజిటల్ పంటల సర్వేను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన రైతుల వివరాలను సేకరించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నమోదు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
అగ్రిస్టాక్ ద్వారా వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్, పౌరసరఫరాలు, ఎరువుల నిర్వహణ, విత్తనాల పంపిణీ, పంటల బీమా, బ్యాంకింగ్, వ్యవసాయ రుణాలు, ప్రధానమంత్రి కిసాన్ పథకం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి అనేక రంగాల్లో సేవలను మెరుగుపరచవచ్చని కలెక్టర్ వివరించారు. రైతుల గుర్తింపు సంఖ్య ఆధారంగా ఎరువుల కొనుగోళ్లు, విత్తనాల పంపిణీ, ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు, పంటల బీమా, రుణాల మంజూరు వంటి సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుంటుందని తెలిపారు. రైతులకు కేటాయించే గుర్తింపు కార్డు ద్వారా వారి భూములు, సర్వే సంఖ్యలు, వ్యక్తిగత వివరాలు అందుబాటులో ఉంటాయని, అర్హత ఆధారంగా ప్రభుత్వ పథకాలను గుర్తించి ప్రయోజనాలు అందించవచ్చని పేర్కొన్నారు.
అగ్రిస్టాక్ అమలులో భాగంగా వ్యవసాయంతో పాటు అనుబంధ శాఖల అధికారులు రైతుల పూర్తి వివరాలను సేకరించి సంబంధిత వ్యవస్థలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బలరామరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు అంబికా సోని, జిల్లా ప్రణాళిక అధికారి చినకోట్యా నాయక్, ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్య, పౌరసరఫరాల అధికారి సురేష్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్‌రావుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.