– వాతావరణ శాఖ హెచ్చరిక
14 Oct 2025 (senani.net): రాష్ట్రంలో మళ్ళీ వర్షాల దోరణి కొనసాగనుంది. నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరణ దశలోకి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడిరచింది. ఈశాన్య రుతుపవనాల ప్రారంభం దాదాపుగా ఖాయమని తెలిపింది. ఈ మార్పుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ప్రభావం కనిపించనుందని సూచించింది. మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు దూసుకురావచ్చని హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు, పంటచేలు లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గురువారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరంలేకుండా బయట తిరగవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. గడచిన 24 గంటల్లో ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని నివేదికలు వెల్లడిరచాయి. కొన్ని మండలాల్లో ఒక్కసారిగా కుండపోతలా వర్షం పడటంతో రహదారులు జలమయం అయ్యాయి. రుతుపవన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. తెల్లవారుజామున చల్లని గాలులు వీస్తాయని, సాయంత్రాలు కూడా చల్లగా ఉండే అవకాశముందని తెలిపింది.
