– విశాఖలో గూగుల్ ఏఐ కేంద్రంతో కొత్త దిశ
14 Oct 2025 (senani.net): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గూగుల్ ఆధ్వర్యంలో ఏఐ హబ్ ఏర్పాటు కావడం దేశ అభివృద్ధి యాత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వికసిత భారత దృష్టికి అనుగుణంగా గిగావాట్ స్థాయి డేటా సెంటర్ మౌలిక వసతులతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన సాంకేతిక ప్రజాస్వామ్యీకరణ లక్ష్యానికి ఈ హబ్ బలమైన వేదికగా మారనుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఆధునిక కృత్రిమ మేధస్సు సాధనాలు ప్రతి పౌరుడి అందుబాటులోకి రావడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను విస్తరించి, విశాఖను దేశ సాంకేతిక పటముపై ముందంజలో నిలపడానికి ఈ పెట్టుబడి దోహదం చేయనుంది. ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రాల సరసన భారత స్థానం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. దేశ ప్రతిభకు కొత్త అవకాశాలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు పెట్టుబడుల ఆకర్షణ ఇలా పలు మార్గాల్లో ఈ ఏఐ హబ్ ప్రభావం చాటనుందనే ఆశాభావం ఏర్పడిరది. విశాఖపట్నం భౌగోళికంగా అనుకూలమైన నగరం కావడంతో పాటు, విద్యా రంగంలో కూడా బలమైన మౌలిక వసతులు కలిగి ఉంది. ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు ప్రపంచానికి చేరుకుంటున్న నేపథ్యంలో, ఈ ఏఐ హబ్ వారిలో మరింత నమ్మకం, అవకాశాలు కలిగించనుంది. స్థానిక ప్రతిభను ఉపయోగించుకోవడానికి సంస్థలు ముందుకు రావటం వలన ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు సాంకేతికతగా నిలుస్తున్న కృత్రిమ మేధస్సు రంగంలో భారత్ స్వావలంబన సాధించాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి ఇది మరో బలాన్నిస్తుంది. గ్రామీణ ప్రాంతాల వరకు సాంకేతిక సేవలు, డిజిటల్ పరిష్కారాలు చేరేలా చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించగలదు. విజ్ఞానం, ఉపాధి, ఆవిష్కరణ ు ఈ మూడు దిశల్లో విశాఖ గూగుల్ ఏఐ హబ్ దేశానికి ప్రేరణగా నిలవనుంది.
