Home ఆర్టికల్స్ సేనాని (senani.net):బంగారం మీద మక్కువ..?

సేనాని (senani.net):బంగారం మీద మక్కువ..?

0
Senani (senani.net): Passionate about gold..?
Senani (senani.net): Passionate about gold..?

– ఆదా అలవాటా లేక భద్రత పేరుతో మనసుకు నిచ్చెనా..
15 Oct 2025 (senani.net): భారతీయుల జీవితంలో బంగారం కేవలం ఒక ఆభరణం కాదు, అది భావోద్వేగం, ఆచారం, భద్రత అనే మూడిరటి మిశ్రమం. పుట్టిన కొత్త బిడ్డకు చిన్న గాజు నుంచి పెళ్లిళ్లలో విరాజిల్లే ఆభరణాల వరకు ప్రతి జీవన సందర్భానికి బంగారమే ప్రతీకగా నిలుస్తుంది. కొందరికి ఇది పెట్టుబడి భావన, మరికొందరికి ఇది కష్టకాలంలో రక్షణగా నిలిచే సహాయకుడు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఆధునిక ఆర్థిక జీవితంలో కూడా అదే బలం చూపుతుండటం మన సమాజ ధోరణికి సూచిక. అయితే ప్రశ్న ఏమిటంటే బంగారం కొనడం నిజంగా ఒక జాగ్రత్తైన ఆదా అలవాటా లేదా భద్రత భ్రమలో పెరుగుతున్న ఒక మానసిక ఆధారం మాత్రమేనా? చాలా మంది బంగారాన్ని బ్యాంక్‌ డిపాజిట్‌ కంటే, షేర్ల కంటే, ఇతర పెట్టుబడుల కంటే భద్రంగా భావిస్తారు. చేతిలో ఉన్న లోహం మన సొంతమని అనిపించే భావన వారికి ధైర్యం ఇస్తుంది. బ్యాంక్‌ వ్యవస్థలపై ఉన్న అనిశ్చితి, మార్కెట్‌ల ఒడిదుడుకులు, ఆర్థిక పరిజ్ఞానం లోపం కారణంగా బంగారం కొనడం సులభమైన మార్గంగా అనిపిస్తుంది.
కానీ వాస్తవానికి బంగారం నిల్వ మన ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కంటే అడ్డంకిగా మారుతున్న దృశ్యం కూడా కనిపిస్తుంది. ఇంట్లో తాళం వేసి పెట్టిన లోహం సంపదలా కనిపించినా అది సమాజ ఆర్థిక చలనం నుంచి బయటపడి ఉండటం వల్ల అసలు ఉపయోగం లేకుండా పోతుంది. అదే డబ్బును పరిశ్రమల్లో, ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడిగా మార్చితే ఉద్యోగాలు పెరుగుతాయి, ఆర్థిక అవకాశాలు ఏర్పడతాయి. కానీ మన అభిరుచి మాత్రం చేతిలో కనిపించే పసిడి పై ఎక్కువ. ఇది మన ఆర్థిక అవగాహన మీద ప్రశ్నలు లేవనెత్తే అంశం.
మరొకవైపు బంగారం మీదున్న మానసిక ఆధారం భద్రత పేరుతో ఒక భ్రమను కూడా పెంచుతుందని చెప్పాలి. ఎంత బంగారం ఉన్నా అది జీవిత సమస్యలన్నింటికీ పరిష్కారం కాదు. ఆరోగ్యం, నైపుణ్యం, జ్ఞానం, సంబంధాలు ఇవే అసలు భద్రతకు బలమైన స్తంభాలు. బంగారం ఒక పరికరం మాత్రమే, జీవన విలువ కాదు. దాన్ని సముచిత పరిమితిలో చూస్తే అది ఆదా అలవాటు. కానీ ప్రతి పొదుపును పసిడి రూపంలోనే మార్చుకోవాలనుకుంటే అది భద్రత భ్రమగా మారి ఆర్థిక స్వాతంత్య్రం పట్ల నిర్లక్ష్యానికి దారి తీస్తుంది. అందుకే సమతుల్యం ముఖ్యం. సంప్రదాయం అనేది మన సంస్కృతికి ఆభరణం, కానీ ఆచరణలో తెలివి ఉండాలి. బంగారం కొనడం తప్పు కాదు కానీ దానిని మాత్రమే భవిష్యత్తు ఆధారంగా భావించడం స్పృహలేమి. ఆదా అంటే నిల్వ కాదు, ఉపయోగించే సామర్థ్యం. మన సంపద మట్టి క్రింద పాతిపెట్టబడకుండా సమాజ అభివృద్ధికి తోడ్పడే దిశగా ప్రవహిస్తేనే నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం సాధ్యమవుతుంది.
బంగారం అంటే మక్కువ మన సంస్కృతిలో బలంగా వేళ్లూరిన అంశం. పెళ్లిళ్లలో కాజాలు మెరుస్తే అది ఘనత సూచకంగా భావిస్తారు. ఎవరి ఇంట్లో ఎంత బంగారం ఉందన్నది అభిమానం, సామాజిక గౌరవానికి కొలమానం అయింది. ఈ భావజాలం కారణంగా బంగారం అవసరానికి మించి కొనబడుతుంది. పిల్లల భవిష్యత్తు పేరుతో, సమాజంలో పేరు నిలుపుకునేందుకు పేరుతో ఆస్తి కంటే ఆభరణాల పైనే డబ్బులు వెచ్చిస్తారు. దీని వెనుక దాగి ఉన్న మనస్తత్వం ఏమిటంటే మన సంపద కంటికి కనిపించే రూపంలో ఉండాలి అనే తపన. అలా కనిపించే రూపాన్నే మనం భద్రతగా భావిస్తాం. ఇంకొక కోణం చూస్తే బంగారం ఒక మానసిక ఆశ్రయం. అనుకోని పరిస్థితుల్లో అమ్ముకుని ఉపయోగించుకోవచ్చనే నమ్మకం ప్రజలలో బలంగా ఉంటుంది. ఇంట్లో రెండు మూడు తులాలు ఉన్నాయంటే మనసులో ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఇదే విశ్వాసం క్రమంగా బంగారం మీద అధిక ఆధారపడే స్వభావాన్ని పెంచుతుంది. పెట్టుబడి పద్ధతులపై అవగాహన లేకపోవడం, ఆర్థిక శిక్షణ తగ్గిపోవడం వల్ల ప్రజలు అందుబాటులో ఉన్న ఉత్తమ అవకాశాలను వదులుకుని పసిడి మార్గానికే పరిమితం అవుతున్నారు. ఇది వ్యక్తిగత స్థాయిలో భద్రత భావనను ఇవ్వొచ్చు కానీ దేశ ఆర్థిక చలనాన్ని తగ్గించే అంశంగా మారుతుంది.
ఆపదలో అమ్ముకోవడానికి బంగారం ఉందనే నమ్మకం ఒకవైపు సాంత్వన ఇస్తే మరోవైపు అత్యవసరాల కోసం ముందుగానే చర్యలు తీసుకోవాలనే జాగ్రత్తను తగ్గిస్తుంది. సరైన బీమా పథకాలు, పొదుపు పద్ధతులు, విభజిత పెట్టుబడి విధానాలు మన సమాజంలో ఇంకా పూర్తిగా ప్రవేశించలేదు. అవి ఉన్నప్పటికీ వాటి మీద విశ్వాసం బంగారం మీద ఉన్నంత బలంగా లేదు. అంటే మనం ఆదా చేస్తామనే నిజమే కానీ అది సరైన దిశగా కదలడం లేదు. భద్రత అనేది ఒక సమతుల్య ఆర్థిక ప్రణాళికతో వస్తుంది, ఒక్క ఆభరణంతో కాదు. ఇప్పుడు సమయం మారుతోంది. కొత్త తరం ఆర్థిక అవగాహన వైపు కదులుతోంది. బంగారం కొనుగోలు కొనసాగుతూనే ఉంటుంది కానీ ఆలోచన విధానం మారాలి. బంగారం ఒక ఆస్తి కానీ అదే ఆదా అన్న భావనను సవాలు చేయాల్సిన అవసరం ఉంది. పొదుపు అంటే బరువైన తులసీలు కాదు, భవిష్యత్తు కోసం సరైన ప్రణాళిక. సంపద కేవలం నిల్వ కాదు, అది సృష్టి. ఈ మార్పు ఆలోచన మొదలైనప్పుడే బంగారం మీదున్న మన మక్కువ సమతుల్యంగా మారి, భద్రత భావన నిజమైన ఆర్థిక స్వాతంత్య్రంగా మారుతుంది.
– విశ్లేషణ : M రాజు పాత్రికేయులు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version