– అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కొత్త మలుపు
– నౌకలపై పరస్పర ఛార్జీల యుద్ధం
– అమెరికా జెండా ఉన్న ఓడలకు చైనా ప్రత్యేక ఫీజు
– చైనా తయారు చేసిన నౌకలకు మినహాయింపు ప్రకటింపు
– ‘‘చర్చలు చేస్తే స్వాగతం, యుద్ధం చేస్తే సిద్ధం’’ – చైనా స్పందన
14 Oct 2025 (senani.net): అమెరికా – చైనా మధ్య వాణిజ్య పోటీ ఇప్పుడు సముద్ర మార్గాల్లోనూ ఉద్రిక్తతను పెంచింది. ఇప్పటికే పరస్పరం సుంకాలు, టారిఫ్‌లు విధించుకుంటూ ఉన్న ఇరుదేశాలు ఇప్పుడు ఓడలపై ప్రత్యేక ఛార్జీల దిశగా అడుగులు వేశాయి. అమెరికా జెండాతో సాగర మార్గాల్లో ప్రయాణించే నౌకలపై త్వరలోనే ప్రత్యేక రుసుము వసూలు చేయనున్నట్లు చైనా అధికారికంగా ప్రకటించింది.
చైనా ఆసక్తికరంగా ఒక నిబంధనను కూడా అమలు చేస్తోంది. చైనా నిర్మించిన నౌకలకు మాత్రం ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. దీని ద్వారా తమ దేశ షిప్‌బిల్డింగ్ పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకే అమెరికా కూడా చైనా నౌకలపై ప్రత్యేక ఫీజులను అమలు చేయడంతో, వాణిజ్య యుద్ధం సముద్ర మార్గాలకు చేరింది. అమెరికా తీసుకున్న నిర్ణయాలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కఠినంగా స్పందించింది. అమెరికా పోరాటానికి రావాలనుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని, అయితే చర్చలకు వస్తే ఆ తలుపులు కూడా తెరిచే ఉన్నామని స్పష్టం చేసింది. ఈ పోటీ సముద్ర రవాణా వ్యయాలను పెంచే అవకాశం ఉందనే ఆందోళన గ్లోబల్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఈ చర్యలతో అంతర్జాతీయ షిప్పింగ్ రంగంపై పెద్ద ఒత్తిడి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా-చైనా వాణిజ్య మార్గాలు ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాలు కావడంతో, ఈ కొత్త ఛార్జీల వల్ల ముడిసరుకు రవాణా ఖర్చులు పెరగవచ్చు. దాని ప్రభావం నేరుగా గ్లోబల్ మార్కెట్ ధరలపై పడి, ఇంధనం నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు పలు రంగాల్లో వినియోగదారులు అదనంగా చెల్లించే పరిస్థితి తలెత్తవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు పెద్దగా కనిపించని ఈ ‘‘సముద్ర సుంక యుద్ధం’’ వాస్తవానికి భవిష్యత్ ఆర్థిక ఆధిపత్య పోరాటానికి ప్రారంభ సంకేతమని భావిస్తున్నారు. అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఈ టెన్షన్‌ను ఇతర దేశాలు సైతం నిశితంగా గమనిస్తున్నాయి. ఇరుదేశాలు ఈ యుద్ధాన్ని చర్చల దిశగా తీసుకెళ్తాయా, లేక మరింత ఘర్షణ స్థాయికి చేరుతుందా అన్నది ప్రపంచ ఆర్థిక రంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
