Home దేశాల వార్తలు జాతీయం సేనాని (senani.net): స్కూల్‌ ప్రిన్సిపాల్‌ దాడి విషాదానికి దారితీసింది

సేనాని (senani.net): స్కూల్‌ ప్రిన్సిపాల్‌ దాడి విషాదానికి దారితీసింది

0
Senani (senani.net): School principal's attack leads to tragedy
Senani (senani.net): School principal's attack leads to tragedy

15 Oct 2025 (senani.net): జార్కండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. గర్హ్వా జిల్లాలోని ఓ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న దివ్య కుమారి సెప్టెంబర్‌ 15న నిర్ణీత డ్రెస్‌ కోడ్‌కు విరుద్ధంగా చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చింది. అసెంబ్లీలో నిలబడి ఉండగా, ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ ద్రౌపది మింజ్‌ అందరి ముందూ ఆమెను గట్టిగా మందలించింది. అంతేకాకుండా చెంపపై బలంగా కొట్టిందని సహ విద్యార్థులు చెబుతున్నారు. ఈ అవమానం దివ్య మనసులో ముద్రపడిరది.
తొలుత సాధారణంగానే ఉన్న దివ్య, సంఘటన తర్వాత మానసికంగా కుంగిపోయింది. ఇంట్లో మాట్లాడకుండా, ఒంటరిగా ఉండటం ప్రారంభించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆమెను డాల్టన్‌గంజ్‌ ఆసుపత్రికి, అక్కడి నుంచి రాంచీ రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా, మానసిక ఒత్తిడి తీవ్రంగా ప్రభావం చూపడంతో అక్టోబర్‌ 14న దివ్య ప్రాణాలు కోల్పోయింది. చిన్న తప్పిదానికి ఇంత పెద్ద శిక్ష పడడం పై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దివ్య మృతితో ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహంతో నిరసన చేపట్టారు. తెహ్రీ భండారియా చౌక్‌ వద్ద రోడ్డును దిగ్బంధించడంతో ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. పోలీసులు, జిల్లా అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో నిరసన కొంతసేపటికి వెనక్కి తీసుకున్నారు. అయితే, ప్రిన్సిపాల్‌ను తక్షణమే సస్పెండ్‌ చేసి అరెస్ట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటన విద్యాసంస్థల్లో శారీరక, మానసిక శిక్షల పై మళ్లీ చర్చకు దారితీసింది. విద్యార్థులపై ఒత్తిడి పెంచే శిక్షణా విధానంపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న తప్పిదాన్ని కూడా అవమానకర పద్ధతిలో చూపించడం, అందరి ముందు అపహాస్యానికి గురిచేయడం పిల్లల మనసుకు తీవ్ర దెబ్బతీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల భావోద్వేగాలను అర్థం చేసుకునే బాధ్యత పాఠశాల యాజమాన్యంపై ఉందని సామాజిక వేత్తలు అంటున్నారు.
దివ్య మరణం దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలకు హెచ్చరికలా మారింది. క్రమశిక్షణ పేరుతో అమానుష ధోరణిని ప్రదర్శించే ఉపాధ్యాయులపై పర్యవేక్షణ తప్పనిసరి అని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. పిల్లల మనసులను గౌరవించే, అర్థం చేసుకునే విద్యా వాతావరణం లేకుండా ఇలాంటి విషాదాలు పునరావృతం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version