15 Oct 2025 (senani.net):ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన భారీ ట్రాఫిక్ జామ్ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దాదాపు 12 గంటల పాటు వాహనాలు కదలక నిలిచిపోయాయి. ముఖ్యంగా పిక్‌నిక్ నుంచి తిరిగి వస్తున్న పాఠశాల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సుమారు 500 మందికిపైగా విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న పిల్లలు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నవారే కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమైన ఈ ట్రాఫిక్ బుధవారం ఉదయం వరకూ కొనసాగింది. మధ్యలో ఆహారం, తాగునీరు లేక విద్యార్థులు ఆకలితో, అలసటతో ఇబ్బంది పడ్డారని సమాచారం. చిన్నారులు ఏడుస్తూ ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కొందరు ప్రయాణికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన విస్తృత చర్చకు దారి తీసింది. ట్రాఫిక్‌లో నిలిచిపోయిన వాహనదారులకు స్థానిక గ్రామస్తులు స్నాక్స్, నీళ్లు అందించడంతో కొంత ఉపశమనం లభించింది.
ఠాణె పరిసర ప్రాంతాల్లో రహదారి మరమ్మతు పనులు జరుగుతుండడమే ఈ సమస్యకు కారణమని అధికారులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో భారీ యంత్రాలు రోడ్డుపై పనిచేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో వందలాది వాహనాలు ఒకేచోట నిలిచిపోయాయి. బాధితులు రోడ్డుపై ట్రాఫిక్ కనీస నియంత్రణ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో మరోసారి మహారాష్ట్రలో రహదారి నిర్వహణ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి తక్షణ చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, మహిళలు, చిన్నారులు ఇలా గంటల తరబడి వాహనాల్లో ఇరుక్కుపోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా పరిస్థితులు మళ్లీ రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
