– కృత్రిమ ఏడుపు స్క్రిప్ట్ అంటూ కాంగ్రెస్ సెటైర్లు
– భావోద్వేగంపై బీఆర్‌ఎస్.. ప్రతిస్పందనలో కాంగ్రెస్ దూకుడు
14 Oct 2025 (senani.net): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రహమత్‌నగర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆమె భర్త మాగంటి గోపీనాథ్‌ను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనవడం సహజమేనని కొంతమంది అంటుంటే, కాంగ్రెస్ మాత్రం ఇది సహజం కాదంటూ కృత్రిమ డ్రామా అంటూ విమర్శలు గుప్పిస్తోంది. బూత్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, కేటీఆర్ ఒత్తిడితోనే సునీత వేదికపై ఏడ్చారని వ్యాఖ్యానించారు. ఒక నాయకురాలిని ప్రజల ముందే కన్నీళ్లు పెట్టుకునేలా ప్రేరేపించడం రాజకీయంగా చాలా దారుణమని ఆయన మండిపడ్డారు. ఇలాంటి స్క్రిప్టెడ్ చర్యలతో ఓటర్ల సానుభూతి పొందాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా బీఆర్‌ఎస్ పైన మండిపడ్డారు. ఓ ఆడకూతురు కన్నీళ్లను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తప్పు అని పేర్కొన్నారు. అధికారానికి అలవాటు పడిన ఈ పార్టీ ఇప్పుడు ప్రతి భావోద్వేగాన్ని ఎన్నికల లాభంలోకి మలచుకోవాలని చూస్తోందని వ్యాఖ్యానించారు.
పొన్నం ప్రభాకర్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, మాగంటి సునీత ఏడ్చే తీరు చూస్తుంటే అది సహజంగా అనిపించలేదని అన్నారు. కన్నీళ్ల వెనుక రాజకీయ లెక్కలు కనిపిస్తున్నాయని, ఇది నిజమైన దుఃఖం కాదని తనకు అనిపించిందని తెలిపారు. సానుభూతి పేరు మీద ఓట్లు సాధించాలనే ప్రయత్నం ప్రజలు గుర్తించలేరని అనుకోవడం పొరపాటు అంటూ కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రచార వ్యూహంలో భావోద్వేగాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో జూబ్లీహిల్స్ పరిసరాల్లో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ఈ వ్యాఖ్యలతో ప్రచారం మరింత ఘర్షణాత్మక దిశగా దూసుకెళ్లేలా కనిపిస్తోంది.
