Home సంపాదకీయాలు సేనాని (senani.net): భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం జయంతి

సేనాని (senani.net): భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం జయంతి

0
Senani (senani.net): Birth anniversary of former President of India and scientist Abdul Kalam
Senani (senani.net): Birth anniversary of former President of India and scientist Abdul Kalam

– శ్రమతో కలలను సాకారం చేసిన వ్యక్తిత్వానికి దేశం వందనం
14 Oct 2025 (senani.net): తెలుగు నేలపై పుట్టకపోయినా తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన మహానుభావుడు అబ్దుల్‌ కలాం. కేరాఫ్‌ చిరునవ్వు, సరళ జీవితం, లోతైన ఆలోచనలు, సంకల్పం ముందు అసాధ్యమనే పదాన్ని తుడిచిపెట్టిన వ్యక్తిత్వం. చిన్నతనంలో వార్తాపత్రికలు అమ్మిన బాలుడు, అనంతరం ఆకాశాన్ని చీల్చిన క్షిపణుల తండ్రిగా దేశం గుర్తించిన ఘనత. ఇంత సరళ జీవితం గడిపినా దేశ చరిత్రలో అతి ప్రకాశవంతమైన పేర్లలో ఒకటిగా నిలిచిపోయాడు. కలాం జీవితం ఒక పాఠం మాత్రమే కాదు, ప్రతి యువకుడికి ఒక సవాలు. పుట్టుక, పేదరికం, అవకాశాల లేమి ఇవేవీ నిజమైన సంకల్పానికి అడ్డంకులు కావని ఆయన చూపించారు. పాఠశాల వైపు నడిచిన అడుగులు అంతరిక్ష స్వప్నాల వైపు మలుపు తిరిగాయి. చిన్న చేపల ఊరులో మొదలైన జీవన ప్రయాణం, దేశ రక్షణ తంత్రజ్ఞానానికి హృదయంగా మారడం ఒక ప్రేరణే కాదు, జాతి ఆత్మవిశ్వాసాన్ని పెంచిన అధ్యాయం. శాస్త్రవేత్తగా ఉన్నప్పటికీ, ఆయన గుండె మాత్రం ఎప్పటికీ ఒక గురువుగా మిగిలింది. క్షిపణుల నిర్మాణం కంటే యువ మనసుల నిర్మాణమే దేశ భవిష్యత్తు అని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రమాణం చేసిన రాష్ట్రపతి స్థానం కూడా ఆయనను మార్చలేదు. రాజభవనపు విలాసాలను పక్కన పెట్టి పుస్తకాల సాధికారతను ఎంచుకున్న సంప్రదాయం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. కలాం మాటల్లో తాత్వికత ఉంది, కానీ ఆ తాత్వికత భూమికి దూరంగా ఉండదు. ఆయన చెప్పేది వేదికల కోసం కాదు, జీవితాల కోసం. ఆయన ప్రసంగాల్లో ఒక మహోన్నత దృక్పథం వినిపిస్తుంది దేశ భవిష్యత్తు ప్రభుత్వాల చేతుల్లో కాదు, కలలు కనగలిగే యువత చేతుల్లోనే ఉందని. అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా దేశం ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది. కానీ జ్ఞాపకం సరిపోదు, ఆయన భావజాలాన్ని జీవితంలో ఉంచుకోవాలనే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. విద్య అంటే కేవలం ఉద్యోగం కాదు, మనసును మేల్కొలిపే దీపం అని ఆయన నేర్పారు. ఓటమిని అంగీకరించకుండా, ప్రతి విఫలాన్ని కొత్త ఆలోచనలకు మార్గంగా చూడమని ఆయన సూచించారు.
ఆకాశాన్ని చూపిస్తూ పిల్లలకు చెప్పేవారు. పరిగెత్తు, ఎగురు, నీలో దాగి ఉన్న శక్తిని నువ్వే మేల్కొలుపుకో. ఈ ఆలోచనే ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఏ రంగంలో ఉన్నా, అతని జీవితం చెబుతున్న సందేశం ఒక్కటే ు సంకల్పం ముందు పరిస్థితులు చిన్నవే. కలాం గారి జయంతి కేవలం గౌరవ దినం కాదు, మనలోని నిద్రిస్తున్న కలలను మేల్కొలిపే రోజు. ఆయన చూపిన మార్గంలో నడవడం, ఆయన మాటలను ఆచరణలో పెట్టడం నిజమైన నివాళి. దేశానికి ఆయుధాలు ఇచ్చాడు, అంతకంటే ముందు ఆత్మవిశ్వాసం అనే ఆయుధాన్ని అందించాడు. అందుకే ఈ రోజు ఒక మహానీయుని స్మరణ మాత్రమే కాదు. మనలోని సామర్థ్యాన్ని గుర్తించుకునే స్వయంకల్పన దినం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version