Home సంపాదకీయాలు సేనాని (senani.net): మారుతున్న ఉద్యోగ ప్రపంచంలో నాయకత్వం ఎలా ఉండాలి

సేనాని (senani.net): మారుతున్న ఉద్యోగ ప్రపంచంలో నాయకత్వం ఎలా ఉండాలి

0
Senani (senani.net): What leadership should look like in a changing world of work
Senani (senani.net): What leadership should look like in a changing world of work

15 Oct 2025 (senani.net): ఆధునిక ఉద్యోగ సంబంధాలు గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు బాస్‌ అంటే భయపడాల్సిన వ్యక్తి, ఆజ్ఞలు జారీ చేసే అధికారి అనే భావన ఎక్కువగా ఉండేది. కానీ నేటి కార్యాలయ సంస్కృతి మారుతోంది. ఇప్పుడు బాస్‌ అంటే కేవలం ఆదేశాలు ఇచ్చేవాడు కాదు, దారి చూపేవాడు, ప్రేరేపించేవాడు, ఉద్యోగి సామర్థ్యాన్ని వెలికితీసే మార్గదర్శకుడు కావాలి. బాస్‌ డే సందర్భంగా నాయకత్వం అంటే అసలు ఏమిటి అనే ప్రశ్నను మనం తిరిగి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది.
ఉద్యోగుల్లో ప్రతిభ, ఆలోచన, సృజనాత్మకత వెలుగులోకి రావాలంటే భయపెట్టే వాతావరణం కంటే నమ్మకం కలిగించే వాతావరణం ముఖ్యం. ఆధునిక నాయకుడు ముందుండి నడిపే వాడు కాదు, తోడుగా నడిచి దారి చూపే వాడిగా ఉండాలి. ఉద్యోగి చేసిన పని కేవలం లక్ష్య గణాంకాల్లో కాదు, అతని ఎదుగుదలలో కూడా కనిపించాలి. పనిచేసే వ్యక్తిని వనరుగా కాకుండా మనిషిగా చూడటం నాయకుడి అసలు గుణం. విన్నపాలు వినగల చెవులు, అర్థం చేసుకునే మనసు, ప్రేరేపించే మాటలు ు ఇవి బాస్‌కు అవసరమైన కొత్త ప్రమాణాలు. ప్రతి కార్యాలయంలో పని ఒత్తిడి సహజమే. కాని ఆ ఒత్తిడిని టీమ్‌కి భారం కాకుండా ప్రేరణగా మార్చగల వ్యక్తినే నిజమైన నాయకుడని పిలవాలి. కొన్ని కార్యాలయాల్లో బాస్‌ ఒత్తిడి పెంచితేనే పనిచేస్తారు అనే భావన ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. ఉద్యోగులు గౌరవించే బాస్‌ కోసం పనిచేస్తారు, భయపడే బాస్‌ కోసం కాదు. గౌరవం కలిగించేది అధికారం కాదు, న్యాయం. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వగల, తప్పు జరిగితే దూషించకుండా దారి చూపగల నాయకత్వం ఉద్యోగుల్లో నమ్మకం పెంచుతుంది. మరో ముఖ్య అంశం టీమ్‌తో బాస్‌ మధ్య ఉండే భావోద్వేగ దూరం. ఆధునిక సంస్థలు చాలా వరకు నిర్మాణాత్మకంగా ఉన్నప్పటికీ, మాత్రం యాంత్రికంగా మారకూడదు. ప్రతి ఉద్యోగి వెనుక ఒక వ్యక్తిగత జీవితం, భావోద్వేగాలు, కష్టాలు, ఆశలు ఉంటాయి. వీటిని గుర్తించి వారికి తోడుగా ఉండగల బాస్‌నే ప్రజలు హృదయపూర్వకంగా అనుసరిస్తారు. మృదుత్వం బలహీనత కాదు, అది నాయకత్వంలోని అత్యంత బలమైన శక్తి అని ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తోంది.
ఇదంతా చూసినప్పుడు బాస్‌ డే కేవలం కృతజ్ఞత తెలిపే రోజు మాత్రమే కాదు, నాయకత్వ అర్థాన్ని పునర్నిర్వచించాల్సిన రోజు కూడా. పదవితో వచ్చే అధికారాన్ని కాకుండా, మనసుతో వచ్చే ప్రభావాన్ని సంపాదించగలగడం అసలైన నాయకత్వం. ఉద్యోగి తన బాస్‌కి భయంతో కాక, గౌరవంతో దగ్గరవుతే ఆ ఆఫీస్‌లో అభివృద్ధి సహజంగా జరుగుతుంది. ఆధునిక ఉద్యోగ సంస్కృతికి తగిన నాయకత్వం అంటే అదే ముందు వరసలో నిలబడి ఆజ్ఞలు ఇవ్వడం కాదు, ఇతరుల్ని ముందుకు నడిపే మార్గాన్ని వెలిగించడం.
ఆఫీసుల్లో చాలాసార్లు కనిపించే వాస్తవం ఏమిటంటే విజయానికి క్రెడిట్‌ బాస్‌కి, తప్పులకు బాధ్యత ఉద్యోగికి మోపడమనే పాత విధానం. ఈ ధోరణి ఇప్పుడు మారాలి. విజయాన్ని టీమ్‌కి పంచి, వైఫల్యాన్ని నాయకత్వంగా స్వీకరించగల ధైర్యం ఉన్నవాడే నిజమైన నాయకుడు. ఇటువంటి నాయకుడు ఉన్న కార్యాలయంలో ఉద్యోగులు తప్పులను భయపడరు, వాటి నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ స్వేచ్ఛ ఉద్యోగుల్లో సృజనాత్మకతకు దారి తీస్తుంది. ఆలోచించేందుకు అవకాశం ఇచ్చే బాస్‌ చేతుల్లోనే నిజమైన అభివృద్ధి మొలకెత్తుతుంది. ఇప్పటి యువత విమర్శకు భయపడరు, కానీ అవగాహనతో చెప్పిన సూచనలను గుండెల్లో దాచుకుంటారు. అందుకే నాయకత్వంలో కమ్యూనికేషన్‌ కీలకం. మాటల ద్వారా ఉద్యోగులను కించపరచడం కాదు, వాళ్ల ఉన్నతిని గుర్తించి ప్రోత్సహించడం ముఖ్యం. గొప్పది. మాటల్లో గౌరవం చూపి, పనిలో ఒత్తిడి పెంచే నాయకుడు కంటే, పనిలో మద్దతు ఇచ్చే నాయకుడే ఉద్యోగి హృదయంలో స్థానం సంపాదిస్తాడు. దీన్ని గుర్తించిన నాయకత్వం మాత్రమే దీర్ఘకాలం నిలుస్తుంది. ఒక బాస్‌ నిజంగా గొప్పవాడని చెప్పాలంటే అతని టీమ్‌లో భయం లేకుండా ప్రశ్నలు అడగగల వాతావరణం ఉందా లేదా అన్నదే ప్రమాణం. ప్రశ్నించగల ఉద్యోగి ఉన్న చోట ఆలోచన ఉంటుంది. ఆలోచన ఉన్న చోట అభివృద్ధి తప్పదు. ఆధునిక కార్యాలయాల్లో పారదర్శకత, తెరవెనుక సంభాషణ, పరస్పర గౌరవం ఉంటే అక్కడ బాస్‌ అనే పదం అధికారానికి కాక నాయకత్వానికి ప్రతీకగా మారుతుంది.
సంస్థల విజయం కేవలం వ్యాపార లాభాలతో కాదు, అక్కడ పనిచేసే ప్రతి ఉద్యోగి సంతృప్తితో కొలవాలి. ఈ సంతృప్తిని ఇచ్చేది జీతం కాదు, వ్యవహారం. రోజుకు ఎనిమిది గంటలు గడిపే కార్యాలయం ఒక ఒత్తిడి కేంద్రం కాకుండా నేర్చుకునే స్థలం అయితే ఉద్యోగులు దానిని కేవలం ఉద్యోగంగా కాక జీవిత భాగంగా చూస్తారు. ఇలాంటి ప్రేరణ కలిగించే వాతావరణాన్ని నిర్మించడం ఒక బాస్‌ కంటే నాయకుడి పని. ఆధునిక యుగానికి తగిన నాయకత్వం అంటే అదే ు మనుషులను ఉపయోగించడం కాదు, వాళ్లలోని సామర్థ్యం పూయేలా చేయడం.
– విశ్లేషణ :M రాజు పాత్రికేయులు,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version